దేవ సంస్తుతి చేయవే మనసా
deeva sanstuti cheeyavee manasaa
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వసించు నో సమస్తమా ||దేవ సంస్తుతి||
జీవమా, యెహోవా నీకుఁ జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయ మిచ్చున్ విభుండు మార్గము తెలిపె, మోషేకుఁ దన కార్యములను విప్పె నిశ్రా యేలు జనమునకు ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
అత్యధిక ప్రేమ స్వరూపియైన ధీర్ఘ శాంతపరుండు నిత్యము వ్యాజ్యంబు చేయఁడు ఆ కృపోన్నతుఁడు నీ పయి నెపుడు కోప ముం చఁడు ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు భూమి కన్న నాకసంబున్న యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
పడమటికిఁ దూర్పెంత యెడమో పాపములకును మనకు నంత యెడము కలుగజేసియున్నాఁడు మన పాపములను ఎడముగానే చేసియున్నాఁడు ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
కొడుకులపైఁ దండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
మనము నిర్మితమయిన రీతి తనకుఁ దెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపుచుండును ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన వాస పుష్పము వలెనె నరుఁడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు ఆ కారణముచే ||దేవ సంస్తుతి||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితోఁ గైకొను జనులకు నిరతమును గృప నిలిచి యుండును యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే ||దేవ సంస్తుతి||