దేవుని ప్రేమ యిదిగో జనులార

deevuni preema yidigoo janulaara

🎵 AKK-149💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనినఁ పరలోక జీవంబు మన కబ్బును ||దేవుని ప్రేమ||

1వ చరణం

సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోఁ జేసెను సర్వోపకారుడుండే మన మీద జాలిపరుఁడై యుండెను ||దేవుని ప్రేమ||

2వ చరణం

మానవుల రక్షింపను దేవుండు తన కుమారునిఁ బంపెను మన శరీరముఁ దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుఁడే ||దేవుని ప్రేమ||

3వ చరణం

యేసుక్రీస్తను పేరున రక్షకుఁడు వెలసి నాఁడిలలోపల దోసకారి జనులతో నెంతోను భాషలను బల్కినాఁడు ||దేవుని ప్రేమ||

4వ చరణం

పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములఁ బొందెడి పాపులందఱు నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని ప్రేమ||

5వ చరణం

సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను సత్ప్రేమగ నడిచెను పరలోక సద్బోధలిక జేసెను ||దేవుని ప్రేమ||

6వ చరణం

చావు నొందిన కొందఱిన్ యేసుండు చక్కఁగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి ||దేవుని ప్రేమ||

7వ చరణం

గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాఁడే మేలు గల యద్భుతములు ఈలాగు వేలకొలఁదిగ జేసెను ||దేవుని ప్రేమ||

8వ చరణం

చేతుల కాళ్లను రా రాజు చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్ ||దేవుని ప్రేమ||

9వ చరణం

ఒడలు రక్తము గారఁగ దెబ్బలు చెడుగు లందఱుఁ గొట్టిరి వడిముళ్లు తలమీఁదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని ప్రేమ||

10వ చరణం

ఇన్ని బాధలు బెట్టుచుఁ దనుఁ జంపు చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేఁడెను ||దేవుని ప్రేమ||

11వ చరణం

రక్షకుడు శ్రమఁ బొందఁగా దేశంబు తక్షణము చీఁక టయ్యెన్ రక్షకుఁడు మృతి నొందఁగఁ తెర చినిఁగి రాతి కొండలు పగిలెను ||దేవుని ప్రేమ||

12వ చరణం

రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును పాఁతి పెట్టిరి భక్తులు నమ్మిన నాతు లందఱుఁ జూడఁగా ||దేవుని ప్రేమ||

13వ చరణం

మూఁడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాఁడు నాఁడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్ ||దేవుని ప్రేమ||

14వ చరణం

పదునొకండు మారులు వారలకుఁ బ్రత్యక్షుఁ డాయె నేను పర లోకమున కేగెను తన వార్తఁ బ్రకటించు మని పల్కెను ||దేవుని ప్రేమ||

15వ చరణం

నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని ప్రేమ||

Report Error