యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక

yeesuvanti priya bandhundu naakinka

🎵 AKK-174💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసువంటి ప్రియ||

1వ చరణం

ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసువంటి ప్రియ||

2వ చరణం

ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసువంటి ప్రియ||

3వ చరణం

తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసువంటి ప్రియ||

4వ చరణం

ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసువంటి ప్రియ||

5వ చరణం

మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసువంటి ప్రియ||

6వ చరణం

తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసువంటి ప్రియ||

7వ చరణం

అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసువంటి ప్రియ||

Report Error