రాజులకు రాజైన యీ మన

raajulaku raajaina yee mana

🎵 AKK-181💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ జయశాలి కన్న మన కింక రాజెవ్వరును లేరని ||రాజులకు రాజైన||

1వ చరణం

కరుణగల సోదరుండై యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగా నమ్ముకొనిన మన కొసఁగుఁ బరలోక రాజ్యమ్మును ||రాజులకు రాజైన||

2వ చరణం

నక్కలకు బొరియ లుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు రాజైన||

3వ చరణం

అపహాసములు సేయుచు నాయన యాననము పై నుమియుచుఁ గృప మాలిన సైనికు లందరును నెపము లెంచుచుఁ గొట్టిరి ||రాజులకు రాజైన||

4వ చరణం

కరమునం దొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్ ధరణీపతి శ్రేష్ఠుడా నీకిపుడు దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు రాజైన||

5వ చరణం

ఇట్టి శ్రమలను బొందిన రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను బరలోక పట్టణంబున జేర్చును ||రాజులకు రాజైన||

6వ చరణం

శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధముఁ జేసెను భక్తితోఁ బ్రార్థించిన మనకొసగు రక్తితో నాముక్తిని ||రాజులకు రాజైన||

7వ చరణం

త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికిఁ జేరిన వారిని యీ ప్రభువు దరుమఁ డెన్నడు దూరము ||రాజులకు రాజైన||

Report Error