నడిపించు నానావ నడిసంద్రమున దేవా

nadipinchu naanaava nadisandramuna deevaa

🎵 AKK-661💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నడిపించు నానావ నడిసంద్రమున దేవా నవజీవన మార్గమున నాజన్మ తరియింప ||నడిపించు నానావ||

1వ చరణం

నా జీవిత తీరమున నా యపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించు లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము ||నడిపించు నానావ||

2వ చరణం

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు నానావ||

3వ చరణం

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశయే ఆవేద నెదురాయే ఆథ్యాత్మిక లేమిగని అల్లాడె నావలలు ||నడిపించు నానావ||

4వ చరణం

ప్రభు మార్గమి విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీమాట ||నడిపించు నానావ||

5వ చరణం

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబును సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని యర్పణగా లోకేశజేయుమయ ||నడిపించు నానావ||

6వ చరణం

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని! ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రానార్పణము చేతు ||నడిపించు నానావ||

Report Error